Thursday, March 26, 2015

ఏక దిన్ కా హంగామా

ఉగాది వెళ్లిన మరుసటి రోజు నేను హాల్ లో సోఫా లో కూచుని పేపర్ చదువుకుంటున్నాను. టింగ్.  టింగ్ .. కాలింగ్ బెల్ మోగింది. పేపర్ పక్కన పడేసి తలుపు తీశాను. ఎవరో  తల్లి కూతురు లా ఉన్నారు. తల్లి చీర  కట్టుకుంది  పిల్ల పంజాబీ  డ్రెస్ వేసుకుంది " ఇకాడ , ఇలెఅయ్ మై నా వేకంట్ గా ఉన్నాయా ?" అర్ధం కాలేదు ఏం కావాలి? అన్నాను. అద్కాదండి. ఇకాడ ఐ మీన్ టూ లెట్ బొడ్ ఉంద్కడా? ఇల్లు ఏమైనా అదేకు దొర్కుతుందా?  అర్ధమయ్యింది ఈ  అమ్మాయి తెలుగుని  ఖూని చేసేస్తున్నాది. లోపాలాకి  రండి, "ఛి ఛి తన మాటలు నాకొచ్చేస్తున్నాయి  ఏంటి?"  అనుకున్నాను మనసులో . పక్క ఫ్లాట్ ఖాళి గా ఉంది మేము ఓనర్స్ కాదు. కానీ కీస్ మాదగ్గరే ఉన్నాయ్. కూచోండి. అన్నాను. ఇల్లు చూబించాను.

 చాలా బాగుందమ్మా, ఇది మా అమ్మాయి అంజలి పూర్తి పేరు దుర్గాంజలి. అంది తల్లి. అమ్మా ఏంటమ్మా ... ఏడుపుమొహం పెట్టింది అంజలి. అర్ధం కానట్టు చూసాను. అంతేనమ్మ, దుర్గ అనే పేరు చెప్పడం ఇష్టం ఉండదు. అంజలి అని చెప్పాలి,  అంది తల్లి  మమ్మీ  గట్టిగా అరిచింది  ఆ అమ్మాయి. కాదు కాదు అమ్మాయి పేరు  ఏంజెల్ . ఇంట్లో అలానే పిలుస్తాం.  అని సర్దుతుంది తల్లి కూతురు శాంతించింది.

 మరుసటి వారం ఏంజెల్ మా అపార్ట్ మెంట్  లోకి వచ్చేసింది. తండ్రి ఆర్  టీ  సి  లో కండక్టర్, పేరు మారుతి, ఏంజెల్ వాళ్ళ అమ్మగారి పేరు మాలతి. మారుతి, మాలతి ఎంతబాగా  నప్పాయో  అన్నాను.  మరుసటి రోజు అంజలి వచ్చింది " రేపు నా బాత్ డే , ఈవినింగ్ పాటీ కి తప్పక రావాలి" అంది. తెలుగు మాట్లాడే పద్ధతి కొంచం ఇబ్బందిగా ఉన్నా సద్దుకు పోవాలి అనుకున్నాను."అలాగే" అన్నాను. మరుసటి రోజు సాయం కాలం ఏంజెల్ ఉంటున్న పక్క ఫ్లాట్ కి  పార్టీ కి వెళ్ళాను.  పార్టీ కి చాలా మంది అమ్మాయిలు  వచ్చారు, 
ఏంజెల్ జీన్స్ వేసుకుని టీ షర్టు వేసుకుంది. మా అపార్ట్ మెంట్ లో అమ్మాయిలంతా ఇంచు మించు అలానే వచ్చారు. వాళ్ళంతా డాన్స్, సాంగ్స్ బాగా హడావిడి చేసారు. ఫోటోలు తీసుకుని ఫేస్బుక్ లో అప్లోడ్ చేసారు.  అంతా వెళ్లి పోయాక. కేక్ మీద పేరు లేదని కేండిల్స్ బాగోలోవని ఏంజెల్  తలిదండ్రులపై  యుద్ధం చేసింది    అలా అంజలి ఇంట్లో క్షమించాలి ఏంజెల్ ఇంట్లో  చాలా  పార్టీలు ,గెట్ టుగెదర్ లు జరిగేయి.   అదే ఇంగ్లిష్ప ద్ధతి. మాట, కట్టు, ఆట పాట. మా అపార్ట్మెంట్ అంతా ఇదే కల్చర్ అనే కంటే ఊరంతా ఇంచుమించుగా ఇదే కల్చర్. ఇలా చాలా కాలం  గడిచింది. నాకు ఇదంతా అలవాటయిపోయింది.

ఆ రోజు ఒక అద్భుతం చూసాను. అపార్ట్మెంట్ ముందు రంగు రంగుల ముగ్గులు. ఆ ముగ్గులని పువ్వులతో అలంకరిస్తూ 16 అణాల తెలుగు అమ్మాయిలా ఏంజెల్. నమ్మలేకపోయాను.  నిత్యం తలుపు లేసుకుని ఖైదీల్లా ఉండే మా అపార్ట్మెంట్ వాళ్ళు మామిడాకుల తోరణాలు కట్టి, మామిడి కాయలు, ఉగాది పచ్చడి గిన్నె, పళ్ళేలలో పెట్టి. తలుపులు బార్లా తెరిచి  కొత్తసంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు.  అంతా  అయోమయంగా ఉంది నాకు. 

పక్కకి తలతిప్పి చూడగానే కరెంట్  షాక్ తగిలినట్టయ్యింది పక్కనే టీ వీ కెమెరాతో  బృందం. 

మా అమ్మ వద్దన్నా లేచి ముగ్గులు వేస్తుంది రోజూ.  అంది అంజలి తల్లి.   అప్పుడు నాకు అంతకంటే  తట్టుకోలేని  దృశ్యం కనిపించింది. ఆ ఆస్కార్ నటన చూసి తట్టుకోలేకపోతున్నాను  అప్పుడు  నాకు 16 అణాల తెలుగు అమ్మయిల బృందం లంగా  ఓణీలలొ కనిపించింది.  వీ ళ్లెవరబ్బా ఎప్పుడూ చూడలేదే అనుకుంటున్నాను,  " ఉగాది శుభాకాంక్షలు" అంటూ  పంచె కట్టులో (నేనెప్పుడూ పంచె కట్టులో ఉంటాను)  ఉన్న నన్ను  అందరూ చుట్టుముట్టారు. వాళ్ళు అంతా మా అపార్ట్ మెంట్ అమ్మాయిలే. నిత్యం జీన్స్ వేసుకుని "ఎకాడ , ఏందుకు,  వాల్లు, వీల్లు," అంటూ తిరిగే వాళ్ళే.   అప్పుడు విడింది మబ్బు. ఈ రోజు టీ వీ ప్రోగ్రాం ఉంది. ఉగాది స్పెషల్.  టీ వీ ప్రోగ్రాం కోసం ఈ హడావిడి. వీళ్ళ కల్చర్, వీళ్ళ సంప్రదాయాలు..  ఏక దిన్ క సుల్తాన్ కథ గుర్తొచ్చింది.  

No comments:

Post a Comment